పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0137-4 నాదరామక్రియ సంపుటం: 07-220

పల్లవి:
ఏమని నుతించవచ్చు యీతని ప్రతాపము
కామించి యీరేడు లోకములెల్లా నిండెను

చ.1:
యీవల దేవుఁడు రథమెక్కితేను దైత్యులెల్ల
కావిరిఁ జక్రవాళాద్రికడకెక్కిరి
భావించి చక్ర మీతఁడు పట్టితే నసురలెల్ల
థావతితోడుతను పాతాళమువట్టిరి

చ.2:
గరుడ ధ్వజము హరి కట్టెదుర నెత్తించితే
పరువెత్తిరి దానవ బలమెల్లను
గరిమ నీ తేరి బండికండ్లు గదలితేను
ఖరమైన దైత్యసేన క్రక్కదలి విరిగె

చ.3:
ధృతి శ్రీ వేంకటేశుఁడు తిరువీధులేఁగితేను
కుతిలాన శత్రులు దిక్కులకేఁగిరి
తతి నలమేల్మంగతో తన నగరు చొచ్చితే
సతమై బలి ముఖ్యులు శరణము చొచ్చిరి