పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0104-3 సామంతం సంపుటం; 07-021

పల్లవి:
మిక్కిలి నేర్చరి యలమేలుమంగ
అక్కర దీరిచి పతినల మేలుమంగ

చ.1:
కన్నులనె నవ్వునవ్వి కాంతునిఁ దప్పక చూచి
మిన్నక మాటాడీనలమేలుమంగ
సన్నలనె యాస రేఁచి జంకెన బొమ్మలు వంచి
అన్నువతోఁ గొసరీని యలమేలుమంగ

చ.2:
సారెకుఁ జెక్కులు నొక్కి సరుసనె కూచుండి
మేరలు మీరీ నలమేలుమంగ
గారవించి విభునికిఁ గప్పురవిడెమిచ్చి
యారతులెత్తీనదె యలమేలుమంగ

చ.3:
ఇచ్చకాలు సేసి సేసి యిక్కువలంటి యంటి
మెచ్చీనతని నలమేలుమంగ
చెచ్చెర కౌఁగిటఁ గూడి శ్రీ వేంకటేశ్వరుని
అచ్చముగానురమెక్కీ నలమేలుమంగ