పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0137-2 ఆహిరి సంపుటం; 07-218

పల్లవి:
ఆపోలికౌనో కాదో అట్టే నీవు చూచుకొమ్మా
పూఁపలై వలపు లెల్లా పూచినట్లున్నది

చ.1:
తగులు కొనెనో మెడఁ దరుణి చూపులెల్లా
అగపడి కల్వదండలై వున్నవి
చిగురుఁబాదాల నిగ్గు జెడగట్టెనో అప్పటి
తగి యల్లదె తులసి దండ వలె నున్నది

చ.2:
చిక్కుకొనెనో నొసలఁ జెలియ నగవులెల్లా
అక్కర ముత్తెపు నామమై నీకున్నది
జక్కవ చన్నుల నీడ సరి నీ యందునంటెనో
నిక్కి నీ చేతుల సంకుఁ జక్కురాలైవున్నవి

చ.3:
మొలచెనో నీవు రాన ముంచి యలమేలుమంగ
మలసి తానే కౌస్తుభమణి యైనది
అలరి శ్రీ వేంకటేశ కలసెనో తా భూసతై
నిలిచి శ్యామ వర్ణము నీమేనైవున్నది