పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0136-6 ఖైరవి సంపుటం: 07-216

పల్లవి:
సిగ్గులేల లోనికి విచ్చేయవయ్య
అగ్గమాయ నావంటిదే ఆపెయు నీకిపుడు

చ.1:
మఱఁగుకు రావయ్య మంచిమేలు సుద్దిచెప్పే
మెఱసి నీవెంత మెచ్చు మెచ్చేవో కాని
తఱి తెరమరఁగింతే తారుకాణించఁగవచ్చు
యెఱిఁగి వలచి వచ్చెనేమౌనో కాని

చ.2:
చేయిచాఁచఁగదవయ్య చేకానుకొకటి ఇచ్చే
ఆయమెరిఁగెంతముదమందేవో కాని
పాయని చుట్టురికాలు పడితళించఁగ వచ్చు
చాయల నీ గురుతులు సరివచ్చివున్నవి

చ.3:
పెనఁగక వుండవయ్య పేరు నీవీపున వ్రాసే
ననిచి నీవందుకెంత నవ్వేవో కాని
ఘనుఁడ శ్రీ వేంకటేశ కలసితివిటు నన్ను
యెనసిన నానీడే యిందాఁకా నేనన్నది