పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0135-6 కన్నడగౌళ సంపుటం: 07-210

పల్లవి:
నవ్వవయ్య యింకను నయగారాలు సేసేను
యివ్వలఁ బంతమిచ్చితి నిఁకనేల అలుక

చ.1:
చెక్కుచేతనూఁదితేనే చేరి కోపగించేవు
మొక్కేమయ్య యింతనుండి ముందరికిని
చక్కగుణమెరఁగక సరసమాడితి నీతో
యిక్కువలు దెలిసితి మిఁకనేల అలుక

చ.2:
చన్నులు దాఁకించితేనే సాదించ వచ్చేవు
యెన్నఁ బాదాలోత్తేమయ్య యింతనుండి
సన్నదెలియక నీకు జవ్వనము చూపితివి
యిన్నియు నేరుచుకొంటిమిఁకనేల అలుక

చ.3:
అంది కాఁగలించుకొంటే ఆసలకుఁ బెనఁగేవు
పొందేనయ్య యింతనుండి భోగమెరిఁగి
అందపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
యింద విడెమొక్కటైతిమిఁకనేల అలుక