పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0134-4 గుజ్జరి సంపుటం: 07-202

పల్లవి:
సొరిది మీసరితెలు చూతుముగాక
అరిది మమ్మేల సాకిరడిగేరు మీరు

చ.1:
చెలిమికాఁడవు గాన చెలి నీకుఁ బెట్టెం దమ్మ
మలసి నవ్వులు నవ్వ మాకేలా
బలిమీకాఁడవుగాన పట్టి నిన్నుఁ దియ్యఁగాను
అలరి యడ్డాలు రానంతమాకేలా

చ.2:
చేకొద్దివాఁడవుగాన చెప్పె నీకుఁ బనులెల్లా
మాకు నిన్ను గేలిసేయ మరియేలా
పైకొన్నవాఁడవుగాన పడఁతి రాకొట్టుగొట్టె
కైకొని మీ మాటల వంకలు దిద్దనేలా

చ.3:
మేనవాఁడవటుగాన మెడగట్టుకొనిపించె
తానె అలమేలుమంగ తమకమేలా
పూని శ్రీ వేంకటేశుఁడ పొందుగా మమ్మేలితివి
కానిలే మిమ్మెరిఁగితి కడమలింకేలా