పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0134-11 ఖైరవి సంపుటం: 07-199

పల్లవి:
వారిధివంటిది యీవలపే కాదా
వారకము నీకు నాకు వలపే కాదా

చ.1:
సుద్దులెల్లా విని నన్ను సోదించక తొలుతే నీ
వద్దికి రప్పించినది వలపేకాదా
పొద్దువొద్దునకు నీ భోగములే మరిపించి
వద్దన్నాఁ బోనియ్యదు యీ వలపేకాదా

చ.2:
మేడెపు రతుల నిన్ను మెప్పించే అంతలోనే
వాడికె నవ్వు నవ్వించె వలపేకాదా
వీడెము చేతికిప్పించి వెంట వెంట నీపొందుల
వాడలెల్లఁ దిరిగించె వలపే కాదా

చ.3:
కలసి శ్రీ వెంకటేశ కౌఁగిట నీ మనసెల్లా
వలవ దీసినది యీ వలపేకాదా
సులభమై లోలోని చూపుల తీగెలనే
వలలొడ్డించినది యీవలపేకాదా