పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0132-6 శ్రీరాగం సంపుటం; 07-192

పల్లవి:
తిరు వీధుల మెరసీ దేవదేవుఁడు
గరిమల మించిన సింగారముల తోడను

చ.1:
తిరు దండెల పై నేఁగీ దేవుఁడిదే తొలునాఁడు
సిరుల రెండవ నాఁడు శేషుని మీఁద
మురిపేన మూఁడోనాఁడు ముత్యాల పందిరి క్రింద
పారి నాలుగోనాఁడు పువ్వుఁ గోవిలలోను

చ.2:
గక్కన నయిదవనాఁడు గరుడుని మీఁదను
యెక్కెను ఆరవనాఁడు యేనుగమీఁద
చొక్కమై యేడవనాఁడు సూర్యప్రభ లోనను
యిక్కువఁ దేరును గుఱమెనిమిదోనాఁడు

చ.3:
కనకపుటందలము కదిసి తొమ్మిదోనాఁడు
పెనచి పదోనాఁడు పెండ్లిపీఁట
యెనసి శ్రీ వేకంటేశుఁడింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీఁదను