పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0132-3 నాట సంపుటం: 07-189

పల్లవి:
పతిఁ బాసి విరహాన భ్రమయకువే నిన్ను
మతకానఁ దమిరేఁచి మన్నించె నితఁడు

చ.1:
నిండుఁబున్నమగదే నీ మోము - నేఁడు
యెండలేఁటికి నాయ యీవెన్నెల
కొండలే కదవె బాగుల చన్నులు - యీ
గండుఁ గోవిల కూఁత కారించీనటవే

చ.2:
కలికి బింబఫలముగదె నీమోవి
పలుకుఁ జిలుకలకేల పగలాయనే
అలులే తురుముగదే అదె నీకు
వలరాజు విలునారి వడిఁబెట్టీనటవే

చ.3:
మెఱుఁగుఁదీగె గదే మేను నీది
నెఱిఁబూవుటమ్ములేల నెగులాయనే
గుఱి శ్రీ వేంకటేశుఁడు కూడె నిన్ను
తఱితో మున్నిటి సుద్ది దలఁపించీనటవే