పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0103-6 రామక్రియ సంపుటం: 07-018

పల్లవి:
వేడుక పడేముగాక వెంగెమాడేమా నిన్ను
వాడలో నాపెతో నేము వాదడిచేమా

చ.1:
ఏయింతికి వలతువు యిట్టె నిజమాడుమంటే
మాయలు సేసి మాటలు మఱపించేవు
ఆయము లెఱఁగ నేము అరుహులము గామా
చాయల నిన్నంతలోనే సాదించేమా

చ.2:
ఎంత చక్కనిది యాపె యిట్టి నేఁజూచేనంటే
దంతపు నవ్వుల జాణతనమాడేవు
ఇంతటి నీ మేలుచూడ యిందుకును దగమా
అంతలోనే నిన్ను పెద్ద ఆరడిఁ బెట్టేమా

చ.3:
ఏమని యడుగు నిన్ను యిట్టె నీ ప్రియురాలంటే
కామించి పరాకుసేసి కౌఁగిలించేవు
చేముంచి శ్రీ వేంకటేశ చేకొంటివిదె నన్ను
ఆమగువఁ దెచ్చుకొంటే అడ్డమాడేమా