పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0131-6 సామంతం సంపుటం: 07-186

పల్లవి:
ఏఁటికి గేలిసేసేవు యింతినింతలోననే
తేటల నీమోహానకు తేఁకువగాదా

చ.1:
తియ్యని మాఁటలకు తేఁకువతోఁ జొక్కి చొక్కి
పయ్యెద వెట్టమరచి భ్రమసెఁ గాక
నెయ్యపు నీ చేఁతలకు నీతోఁ బెనఁగఁగాను
చయ్యన గొప్పతురుము జారెనిట్టె కాక

చ.2:
నంటున నీవు నవ్వే ననుపైన నవ్వులకు
అంటి చెక్కుచేత వెరఁగందెఁ గాక
దంటతనమున నిన్నుఁ దప్పక చూచినందుకు
వొంటుచు నిట్టూర్చుల వుసురనెఁ గాక

చ.3:
కందువ నిన్నింతలోనె కాఁగిలించుకొన్నందుకు
మందలించి యిట్టె మారుమలసెఁ గాక
అందుకొని శ్రీ వేంకటాధిప కూడినందుకు
ముందు ముందు నీ కిదిగో మొక్కుమొక్కెఁ గాక