పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0131-4 శ్రీరాగం సంపుటం; 07-184

పల్లవి:
రమణుఁడు చూచుఁగాని రమ్మనరె యీవేళ
తమితోనిట్టే దయ దలఁచుమీ యనరే

చ.1:
వదన చందురునిపై వాసన కస్తూరి బొట్టు
చెదరుచున్నది చూడరే చెలులాల
పదరి రాహువు దన్నుఁ బట్టినట్టి పగదీర
పదిలాన తా మగుడఁ బట్టిన యట్లుండె

చ.2:
చల్లఁగాఁ జెలి చెక్కులఁ జల్లిన కప్పురథూళి
జల్లన రాలీఁ జూడరే సతులాల
కొల్లలుగా నయనచకోరములు వెన్నెలలు
వొల్లనె తనిసి వెళ్ళను మిసినట్లుండె

చ.3:
తుమ్మిఁద గుంపువంటి తొయ్యలినెరుల రాలె
కమ్మవిరులు చూడరే కాంతలాల
కొమ్మశ్రీ వేంకటేశునిఁ గూడిన రతికి మెచ్చి
తమ్ముఁదామె నిండు వసంతమాడినట్లుండె