పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0130-5 శుద్దవసంతం సంపుటం: 07-179

పల్లవి:
ఇంతిఁ గరుణించవయ్యా యేల యేఁచేవు
చెంతనుండి నీకు బుద్ధి చెప్పేటివారమా

చ.1:
చన్నుగుబ్బల మదము సమరతినైతేఁ గాక
కన్నులఁ జూచినంతనే కాంక్షదీరునా
కన్నెపాయపు సిగ్గులు కలయికలనుగాక
విన్న వినుకలినే విడిపంచవశమా

చ.2:
జవ్వనములో బిగువు సాములుసేసినఁ గాక
నివ్వటిల్లు మాటలఁ దనివి దీరునా
మవ్వపుమాయలగుట్టు మచ్చికెచేఁతలఁ గాక
నవ్వినమాత్రములోనె నలి మాన్సవశమా

చ.3:
గరిమ చేతులకసి కాఁగిటఁ గూడినఁ గాక
సరసములాడితే నాసలు దీరునా
సరి నిట్టే యేలితివి సతిని శ్రీ వేంకటేశ
తెరవేసికొన్నంతనే తెలియఁగవశమా