పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0129-5 నాదరామక్రియ సంపుటం; 07-173

పల్లవి:
చూడనొక్కఁడవుగాని సుద్దులెనై నాఁ గలవు
వేడుకలు దైవారె వెలఁదులిందరికి

చ.1:
ఒక్క నీ రూపమేకాదా వూరివారెల్లాఁ జూచితే
పెక్కులై మనసులోఁ బెనగొనేది
వుక్కున నీవాడినమాటొక్కటే కాదా యిందరి
వెక్కసపువీనులలో వింత వింతలైనవి

చ.2:
చేసిన నీసన్నేకాదా చెలులమర్మములకు
ఆసకొలిపి మోహాలంటించినది
పోసరించి నీమోవితీపులేకావా గొల్లెతల
వాసుల నోరూరించి వలలఁ బెట్టినవి

చ.3:
సెలవి నీనవ్వేకాదా చిమ్మిరేఁచి యింతులకు
పులకలు మేనులఁ బొడమించేది
వెలయ నన్నేలితివి శ్రీ వేంకటేశ యిదె కాదా
కలయికలిందరికి కాంక్షలురేఁచినది