పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0129-3 వరాళి సంపుటం: 07-171

పల్లవి:
మేరమీరి నడచితే మెలుఁతలేల మానేరు
నేరుపులు కన్నవారె నెరపకుండుదురా

చ.1:
వుద్దాలు వెట్టే యాపె వూడిగము సేయఁగాను
వొద్దఁ గూచుండుమనుచు వొడివట్టేవు
కొద్దీమీరనదిచూచి కుంచెవేసే ఆపెవచ్చి
వుద్దండానఁ గూడుమంటే వోపననవచ్చునా

చ.2:
గొడుగువట్టేయాపె కోరి బత్తీసేయఁగాను
కడుఁ బాబాలొ త్తుమని కాఁగలించేవు
అడరి యీసుద్దివిని అడపముసతి వచ్చి
తడవి మోవడిగితే దాఁచుకొనవచ్చునా

చ.3:
సురటి విసరేయాపె చొచ్చి కొలువుసేయఁగా
తెరవేయి మని కూడి మరిగించేవు
ఇరవై శ్రీ వేంకటేశ యిందుకే నేనిటు వచ్చి
గరిమఁ బెండ్లాడితి కాదనవచ్చునా