పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0129-2 కన్నడగౌళ సంపుటం: 07-170

పల్లవి:
ఎట్టు నమ్మి పాందులు సేసేరింతులు నీతోను
మట్టెరిఁగి నీవె యిట్టే మన్నించవలెఁ గాక

చ.1:
తొల్లటిమాటలకుఁగా తొడరి సూడువట్టేవు
మల్లాడి రాతికి మారుమలసేవు
చుల్లరీఁడవై యెందైనా జొరఁబారేవు కెరలి
పల్లటీఁడవై పడుచుపనులఁ దిరిగేవు

చ.2:
పిన్నవాఁడవై యుండి పెచ్చు పెరిగేవు సారె
కన్నవారితోనెల్లా కలహించేవు
పన్నియాఁటదానిచేత బాససీయించుకొనేవు
సన్నలఁ బక్షపాతాన సాముసేయించేవు

చ.3:
బతిమాలించి మతులు భ్రమయించఁ జేసేవు
రతికేళినే కడుఁగరాళించేవు
ఇతవై శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టె
చతురతల వలపు సాదించేవు