పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0129-1 శ్రీరాగం సంపుటం: 07-169

పల్లవి:
ఇట్టి నిన్ను నుతియించ యెవ్వరితరములయ్య
నెట్టున పెక్కురూపాల నెలవై నీవుంటివి

చ.1:
నిక్కి దేవుళ్ళు ముత్యాల నీపై వసంతమాడఁగా
చుక్కలలో చంద్రుఁడవై చూపట్టితివి
గక్కన మఱియు వడగండ్లవానలతోడి
మిక్కుటపు తొలుకరి మేఘమవై యుంటివి

చ.2:
నిగ్గుగల ముత్యాలు నెలఁతలు చల్లఁగాను
బుగ్గలతో వారాశిఁ బోలితివి
అగ్గమై అప్పటినీఅంగములనంటితేను
తగ్గక బ్రహ్మాండాలు ధరించినట్టుంటివి

చ.3:
తడవెలమేల్మంగ ముత్యాలసేస చల్లఁగాను
పొడము మొగ్గల సురపాన్నఁ బోలితి
కడఁగి శ్రీ వేంకటేశ క్రమ్మరనెంచి చూచితే
వడియు నురుగుల కవ్వపుఁగొండఁ బోలితి