పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0128-2 శ్రీరాగం సంపుటం; 07-164

పల్లవి:
అందమాయనయ్యనేఁడు అన్నిటా నీవిభవాలు
చందపుతరులైనవి సంబంధాలు

చ.1:
కోరి నీమోహపుసతి గుబ్బలవలెనున్నవి
పోరచి నీపెండ్లిలోని బూజగుండలు
చేరి యాపె కుమ్మరించే సిగ్గువలెనున్నది
వేరె యిద్దరినడుమ వేసిన తెర

చ.2:
ననిచిన యీలేమనవ్వువలెనున్నది
మునుకొని నీశిరసుముత్యాల సేస
చొనిపి యెదురుచూచే చూపులవలెనున్నవి
ఘనముగా వేసుకొన్న కలువలదండలు

చ.3:
జోడుగాఁ జెలియిచ్చిన సామ్ములవలెనున్నవి
కూడినవేళ నీమేని గోరొత్తులు
యీడుగా శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిట్టె
వేడుకవలెనున్నది విందుల నీమోవి