పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0127-6 పాడి సంపుటం; 07-162

పల్లవి:
ఔనే ఇది జాణతనమందుకు నేమెచ్చితిని
నానోరఁ బలికేనంటే నవ్వు వచ్చీఁ గాని

చ.1:
కానుకగా తనకు నేఁగప్పురమంపితినని
ఆనవాలు చెప్పిపంపీనందుకేమే
పూని తా వలచినట్టి పాలఁతిఁ దోడితెమ్మంటే
దీనికి నేనియ్యకొని తేరాదు గాని

చ.2:
అడరి సొమ్ములిద్దరమట్టే మార్చుకొంటిమని
అడియాలమిచ్చి పంపీనందుకేమే
తడవి యేమైనాను తనకును నాపెకును
యెడనెడఁ బండుండఁ జోటియ్యరాదు గాని

చ.3:
రంగుగ నేఁ గూడినట్టి రహస్యపు వేళదని
అంగపుగురుతు చూపీనందుకేమే
యింగితాన శ్రీ వేంకటేశుఁడాకె తన పొందు
కంగవించి సాకిరై తనకనరాదు గాని