పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0127-3 దేసాక్షి సంపుటం: 07-159

పల్లవి:
ఏమని వుండునొకో యీతని మనసులోన
వేమరుఁ జెలులు విన్నవించరె మీరైనను

చ.1:
పంతమునఁ దనుఁ జూచే పరాకున నేను
మంతనానఁ గాఁగిలించ మఱచితిని
సంతసాన మాఁటలాడే సంబురముతోడనే
యింతలో ముత్యాలఆరతెత్త మఱచితిని

చ.2:
ననుపునఁ దనతోడ నవ్వేటివేడుకనే
మనవిఁ బ్రియము చెప్ప మఱచితిని
చెనకి పెండ్లిపీటపై నేసచల్లే సందడినె
పెనఁగి మోవివిందు పెట్టమఱచితిని

చ.3:
వొఱగి తనవద్దఁ గూచున్న మందెమేళాననే
మఱఁగుగఁ దెరవేయ మఱచితిని
యెఱిఁగి శ్రీ వేంకటేశుఁడేలె నన్ను మన్నించి
నెఱవైన గురుతులు నించ మఱచితిని