పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0127-2 పాడి. సంపుటం; 07-158

పల్లవి:
నేనెఱఁగనా వోయి నీజాడలు
లేని మరుఁగులు వెట్టి కాననీవు వలపు

చ.1:
యింతిఁజూచి యారూపే యదలోనఁ బెట్టుకొని
చెంతనున్న సతులనుఁ జిత్తగించవు
మంతనాననాడిన మాటలు దలఁచుకొని
వింతవారిమాటలు వీనులఁబెట్టవు

చ.2:
యెదుటనే ఆపెనవ్వు యెగపోసి దిగపోసి
కదిసెందరు నవ్వినాఁ గనుఁగొనవు
మొదలఁ గూడినభావములకు లోలోఁ జిక్కి
సుదతులెందరంటినా సోంపులఁ గరఁగవు

చ.3:
ఘనమైన చన్నుల కాఁగిలి యిట్టే మరిగి
పనిగొన్న తమకాన భ్రమసితివి
యెనసితివిటు నన్ను యింతలో శ్రీ వేంకటేశ
ననుపుసతుల సన్నలకిచ్చగించవు