పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0126-6 సాళంగనాట సంపుటం: 07-156

పల్లవి:
ఎగసక్కీఁడవు నిన్నునేమి చెప్పేము
నగితేనే సెలవుల నానఁబాలు చూపేవు

చ.1:
చిల్లరలయ్యిన నీచేఁతలే కొత్తలుగాక
తొల్లిటివాఁడవేకావా దొరవు నీవు
గొల్లదాననైతేనేమి కొలువుకు వచ్చితేను
చల్లకుండలంటాను నాచన్నులంటేవు

చ.2:
అప్పటప్పటికిఁ బెట్టే ఆనలే వేరుగాక
యెప్పటిగుణాలేకావా యెంచితే నీకు
కప్పి దొడ్డివారమైతే కన్నులమొక్కినంతలో
పిప్పి మీఁగడున్నదంటా పెదవులానేవు

చ.3:
మత్తిలి నన్నేలితివి మన్ననలెన్నిచ్చినాను
పాత్తులకాఁగిలేకాదా భోగించేది
హత్తి శ్రీ వేంకటేశ ఆలవారమైతేఁ జూచి
కొత్తపేయల గూడంటా కొప్పంటేవు