పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0126-5 రామక్రియ సంపుటం; 07-155

పల్లవి:
ఎదుటనేవుండి యాల యెలయించేవే
అదనఁ జేకొనఁగాను అలయకువే

చ.1:
కలికి నీకన్నులు కడు సోగలు
మొలక చన్నులె ములుచేఁగలు
వెలయ వలచె నీవిభుఁడిందుకే
పిలిచీ సారెకునిఁకఁ బెనఁగకువే

చ.2:
నీలాలవంటివి నీకప్పునెఱిఁగురులు
తాలిమి నీనడపులు తగుఁగరులు
కాలమందె మోహించె నీకాంతుఁడిందుకే
కేలుచాఁచీ నీమీఁద జంకించకువే

చ.3:
ముంచిన నీచెక్కులద్దముల మించులు
పంచ మోవిచుంచులు బింబపుటంచులు
యెంచఁగ శ్రీ వేంకటేశుఁడేలె నిందుకే
కంచపురతి యొసఁగె కదుమకువే