పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0126-4 బౌొళి సంపుటం: 07-154

పల్లవి:
నేనెఱంగనా నీనేరుపులివి
నానాగతుల లాలించి నవ్వింతువు

చ.1:
వెలి నీవేడనుండినా వెసనేఁదలఁచితే నా
తలఁపులోననెయుండి దయసేతువు
లలినెంతపరాకైనా లక్షించి నిన్నుఁ జూచితే
చలువమోవియొసగి చనవిత్తువు

చ.2:
పాటించి నీపేరుకుచ్చి బయలుమాఁటలాడితే
మాటలోనుగానే వచ్చి మన్నింతువు
నీటునఁ గొలువులోన నీకు నేనిట్టె మొక్కితే
చోటు చూపి నాతోనే సుద్దులు చెప్పుదువు

చ.3:
ఆతలిమోమైవుండఁగానట్టే చేతులు చాఁచితే
చేతులనే సన్నసేసి చెనకుదువు
యీతల శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ బెండ్లాడితి
రాతిరిఁ బగలు నన్ను రతులఁ జొక్కింతువు