పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0125-6 బౌళి సంపుటం: 07-150

పల్లవి:
ఏమని చెపఁగవచ్చు యింతా నీభాగ్యమే
వేమారునెంచి చూచితే వింతలై నిలుచును

చ.1:
ధరలోఁ గప్పురమందరికిఁ జల్లనైయుండు
విరహులకైతేను వేఁడై యుండును
తరుణులకు నవ్వులు తగవినోదమైయుండు
కెరలించ నీకవే వెంగెములై పరగును

చ.2:
ఇమ్ముల సంపంగిపూవులిందరికితవై యుండు
తుమ్మిదలకైతేనే దొరయకుండు
కొమ్మలకు జంకెనలు కోరి సింగారాలై యుండు
వుమ్మడి నీకైతే మర్మాలొరయుచుండును

చ.3:
భూమికెల్లాఁ జందమామ పొసఁగించు వేడుకలు
తామరలకైతేనే తలవంపులు
కామించి శ్రీ వేంకటేశ గక్కన నన్నేలితివి
యీమేలు నీకైతేను యియ్యకోలై యుండను