పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0125-4 సాళంగనాట సంపుటం: 07-148

పల్లవి:
తనకు బుద్దిచెప్పేటి దాననా నేను
చనవున విన్నవించే సమ్మతించుమనవే

చ.1:
బడివాయకుండితేను పాయమే కామథేనువు
యెడయని పతులకు నింతులకును
చిడిముడి మానితేను చిత్తమే తనచుట్టము
తడయక రమణునిఁ దలఁచుకొమ్మనవె

చ.2:
వదలక కూడుండితే వలుపే సామ్రాజ్యము
సదరానఁ బైకొనేటి జాణలకును
కదిసి వెత మానితే కాయమే నిధానము
యెదలోన తన్నుఁదానె యెరుఁగుకొమ్మనవే

చ.3:
కందువలొనఁగూడితే కాఁగిలే కల్పతరువు
సందడిఁ బెనఁగ నేర్చే సరసులకు
యిందరిలో శ్రీ వేంకటేశుఁడు నన్నేలినాఁడు
మందలించి యిట్లానే మన్నించుమనవే