పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0125-3 పాడి సంపుటం; 07-147

పల్లవి:
ఇంతటి నీ నోముఫలమేమి చెప్పేది
కాంతరో యిదె నిచ్చకల్యాణముగాదా

చ.1:
మాట జవదాఁటని మగవాఁడు గలిగితే
ఆఁటదాని భాగ్యమేమని చెప్పేదే
యీటుననాతఁడుఁదాను యేకచిత్తమైవుండితే
చాటువకెక్కిన జన్మసాఫల్యము గాదా

చ.2:
వెంటవెంటఁ దిరిగేటి విభుఁడు గలిగితేను
యింటిలోనిల్లాలిపుణ్యమేమి చెప్పేదే
బంటువలెఁ బనిసేసి పాయకాతఁడుండితే
అంటి మనోరథఫలమబ్బుటది గాదా

చ.3:
పక్కవాయకుండేటి ప్రాణుశుఁడు గలిగితే
యెక్కువైన సతిసాఖ్యమేమి చెప్పేదే
ఇక్కడ శ్రీ వేంకటేశుఁడిటు నిన్నూ నన్నుఁ గూడె
తక్కక మనకుఁ దాఁ బ్రత్యక్షమవుటగాదా