పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0125-11 శ్రీరాగం సంపుటం: 07-145

పల్లవి:
బొమ్మల జంకించెనంటా పాలఁతిని దూరేవు
క్రమ్మరనిందుకుఁగానె కరఁగీ లోలోపలను

చ.1:
జక్కన పిట్టలవంటి చన్నులమీఁద నీవు
వుక్కువంటి కొనగోరనూఁదవచ్చునా
లక్కవంటి మనసిది లలన యిందుకుఁగానె
వొక్కరీతి సిగ్గువడి వున్నది లోపలను

చ.2:
తలిరాకువంటి మెత్తనిమోవిమీఁదను
ములువాడిదంతములు మోపవచ్చునా
కలువకామవంటి కామిని యిందుకుఁగానే
వులువచ్చి (?) చేఁతలతో వున్నది లోపలను

చ.3:
కడులేఁతతీగెవంటి కాయముమీఁద నిట్టే
అడరి నీగట్టియురమదిమితివి
యెడయక శ్రీ వేంకటేశ యిందుకుఁగాఁ జెలి
వుడివోని రతులతో నున్నది లోపలను