పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0124-6 ఆహిరి సంపుటం; 07-144

పల్లవి:
సిగ్గరి పెండ్లికూఁతురు చెలియనింతసేతురా
తగ్గక సెలవి నవ్వు తతిగొనెను

చ.1:
పువ్వుల వేసినవేటు పుప్పాడి నిండాఁ జింది
జవ్వని చన్నులమీఁద జాజుకొనెను
చివ్వన మైచెమరించి చిత్తడిచెమటతోడ
దువ్వటపుఁ బయ్యదెల్లాఁ దొప్పఁదోఁగెను

చ.2:
పన్నీటఁ జిమ్మిన చిమ్ము పదను పైపైఁ గప్పి
కన్నెచెక్కులమీఁద కారుకమ్మెను
వున్నతితోఁ బులకించి వొగిఁ బొకముడి జారి
తన్నుఁదానె నిట్టూర్చులఁ దడఁబడెను

చ.3:
గందానఁ బూసినపూఁత కడగి లప్పలు గట్టి
యిందుముఖెలమేల్మంగకింపులాయను
కందువ శ్రీ వేంకటేశు కౌఁగిటఁ బేంట్లు రాలి
సందడిరతులలోన సంగతాయను