పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0124-1 నాదరామక్రియ సంపుటం: 07-139

పల్లవి:
చిత్తగించవయ్యా చెలియసింగారాలు
కొత్తకొత్తబాగులై గుంపులు గట్టీని

చ.1:
వలిపపయ్యదలోన వడివెట్టు వలపులు
కలికి చన్నులై మించెఁ గాంతకును
కులుకుఁజూపులెల్లాను కూడపోయఁగానె కాదా
తలరాశై చీఁకటి దట్టపుఁ గొప్పాయెను

చ.2:
మనసులో కోరికలు మట్టుమీరి దైవారి
పెనుఁబులకలై నిండి పెరిగె మేన
పెనపరిమాటలెల్లా పెదవిపై నూరి వూరి
తనివోని యధరామృతములై నిలిచెను

చ.3:
జిగిమించు రతులలో చిమ్మిరేఁగి వేడుకలు
మొగమునఁ గళలై ముంచుకొనెను
తగిలి శ్రీ వేంకటేశ తతినీకెఁ గూడితివి
నగవులు సెలవుల నారుకొనఁ జొచ్చెను