పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0103-1 ఆహిరి సంపుటం; 07-013

పల్లవి:
ఏల మమ్ము గేలిసేసేరింతులాల
మేలుమీఁది దాననింత మెచ్చఁగదరమ్మా

చ.1:
చలము సాదించఁబోతే జవ్వన మాఁపఁగరాదు
పలుకకుండేనంటే ఫలము లేదు
చెలువుఁడెదుట వచ్చి చెయి వట్టుకున్నవాఁడు
తొలఁగఁదోయఁగరాక తూర నవ్వెనమ్మా

చ.2:
కోపగించుకొనఁబోతే కొసరఁగఁ జోటులెదు
చూపుల జంకించేనంటే సాగయదది
యేపున నితఁడు వీరమిందమనుచున్నవాఁడు
పై పై నొదుగలేక భావించేనమ్మా

చ.3:
పంతములాడేనంటే పతితో బలము లేదు
వింత సేసుకుండేనంటే వేడుక లేదు
యింతలో శ్రీ వేంకటేశుఁడెమ్మెమూపినన్నుఁగూడె
చింతదీర వెరగుతోడి సిగ్గుపడేనమ్మా