పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0123-6 ముఖారి సంపుటం: 07-138

పల్లవి:
నీవే యింత సేతువట సేనియ్యకొనలేనా
పోవులై నీకే చింత పుట్టునని కాక

చ.1:
తాపానఁ బొందింతువట తగనేఁబొరలలేనా
పాపముఁ నీకంటుననే భయముగాక
కోపగింతువట నీవు కోరి నేనోరువలేనా
దీపించనన్నిటా నీకుఁ దిట్టువాటని కాక

చ.2:
ఆసకొలుపుదువట అలఁతకోపంగలేనా
దాసులు నిన్ను నమ్మరింతానని కాక
మోసపుత్తువట నీమొరఁగుకు లోఁగాలేనా
వీసమంత నీదయకు వెలితని కాక

చ.3:
కౌఁగలింతువట నిన్నుఁ గరఁగించ నేలేనా
చేఁగ నీచిత్తము దెలిసేనని కాక
దాఁగక శ్రీ వేంకటేశ దక్క నన్నుఁ గూడితివి
తూఁగలేనా నీకు సరి దొరవని కాక