పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0123-5 శంకరాభరణం సంపుటం: 07-137

పల్లవి:
దేవ నీవునికి తేటతెల్లమాయను
భావించ మాకుఁ గన్నులపండుగాయను

చ.1:
పన్నీటిజలకములు భామకనుచూపులును
యెన్నికెఁ గూడుక నీమైనేరులై పారె
తిన్ననిచెమటలెల్లా తిరుమేననెల్లా నిండి
అన్నిటా ముత్యాలపెనుహారములాయ

చ.2:
తెల్లని కప్పురకాపుతెఱవనవ్వులు గూడి
పాల్లుగాని పుష్పాళ్ళపోగులాయను
మెల్లినె నీవురూపుల మించుల రవలురేఁగి
వొల్లనె తడిసూళ్ళవొత్తులాయను

చ.3:
అంగంపుఁ బుళుగుకాపు అలమేలుమంగఁ గూడి
సింగారాలాయను మంచిసిరులాయను
ముంగిట శ్రీ వేంకటేశ మోహనపుమీకూటమి
సంగతిఁ బువ్వుదండల జాడలాయను