పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0123-4 మధ్యమావతి సంపుటం: 07-136

పల్లవి:
ఆతడిచ్చిన చనవే అన్నిటా నీకు
గాతసీయకింతట మొక్కఁగరాదా నీవు

చ.1:
సన్నచేసి రమణుఁడు సలిగె నీకిచ్చెనంటా
యెన్నిమాటలాడేవే యేమే నీవు
ఉన్నతినెందుకైనాను వోరిచీనాతఁడంటా
మిన్నక నేఁడెంత మేరమీరేవే నీవు

చ.2:
దొరతనమిచ్చి నీపొందులకు లోనాయనంటా
కెరలి యేమిటికి జంకించేవే నీవు
సిరుల నీచేఁతలెల్లాఁ జెల్లిఁచీనంటాను
వొరసి గోరనేల వూఁదేవు నీవు

చ.3:
కదిసి యాతఁడు మెచ్చి కాఁగలించుకొనెనంటా
వుదుటుఁ జన్నులనేల వొత్తేవే నీవు
వెదకి యిటువంటి శ్రీ వేంకటేశుఁడేలెనంటా
ముదమున రతినెంత ముంచేవే నీవు