పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0123-2 రామక్రియ సంపుటం; 07-134

పల్లవి:
ఊరకున్నా నెఱఁగఁడు వొడులు సోదించ వచ్చీ
కేసి వొక్కరొక్కరమే గెలువఁగలేమా

చ.1:
అంకులచేతులు వట్టి యానలేల పెట్టీని
సంకెలేని కొయ్యకాఁడు జాజరకాఁడు
మంకుల గొల్లెతలము మందవారమెల్లాఁ గూడి
కుంకుమగుబ్బలనే కుచ్చి యెత్తలేమా

చ.2:
చల్లచాడెలంటుకొని జాణతనాలాడీని
పల్లదపు గద్దరీఁడు బయకాఁడు
కల్లరి దొడ్డివారము కన్నెలమెల్లాఁ గదిసి
పల్లుసోఁకులనె మోవి పచ్చిసేయ లేమా

చ.3:
తోడనె వెన్నదుబ్బలు తొడుకనేల వచ్చీని
వేడుకకాఁడు శ్రీ వేంకటేశుఁడు
కూడె మమ్ము రేపల్లెకొమ్మలెల్లానిఁక
వీడెపుఁ దమ్ములు వెట్టి వింతసేయలేమా