పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0123-11 సామంతం సంపుటం: 07-133

పల్లవి:
దయ దలఁచేదికఁ దనచిత్తము
నయముగా మాటాడితే నాభాగ్యము

చ.1:
మొగము చూచి నేను మొక్కి నిలుచుండఁగానే
తగవులు నడపినాఁ దనచిత్తము
జిగితోఁ దనపాదాలసేవలు నేఁ జేయఁగాను
నగి యెంత మన్నించినా నాభాగ్యము

చ.2:
కలిమితోఁ దనకు నే కాపురము సేయఁగాను
తలఁ పెంత గలిగినాఁ దనచిత్తము
పిలిచి యప్పటి నేనే ప్రియములు చెప్పఁగాను
నలిరేఁగి మెచ్చేది నాభాగ్యము

చ.3:
కనుఁగొని నేఁ దన్ను కాఁగలించి కూడఁగాను
తనివెంత సేసినానుఁ దనచిత్తము
యెనసె శ్రీ వేంకటేశుఁడిచ్చకము నేనాడఁగా
ననుపై యిట్టేవుండేది నాభాగ్యము