పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0122-1 పాడి సంపుటం; 07-127

పల్లవి:
చుట్టమవో మఱి నీవు సూడుబంటవో
గుట్టుతోడనుండఁగానే గోరసీతురా

చ.1:
సెలవుల నవ్వుతానే చేతిగోరఁ జిమ్ముదురా
పలువినయాలు చేసే పడఁతిని
కొలువు సేయించుకొంటాఁ గొప్పువట్టి తీతురా
వలపులు నెరుపే నీవద్దిదానిని

చ.2:
చల్లని మాటాడుతా చన్నులు విసుకుదురా
మెల్లినే పాదాలొత్తే మెలుఁతను
కొల్లగా నాకందుకొంటాఁ గొంగువట్టి తీతురా
వుల్లము నీకొప్పగించి వుండేటిదానిని

చ.3:
కన్నులను మొక్కుతానే కౌఁగిట బిగింతురా
సన్నలఁ బ్రియము చెప్పే జవరాలిని
యెన్నఁగ శ్రీ వేంకటేశ యేలితివి చెలినిట్టే
మన్ననల విఱవీఁగి మలసేటిదానిని