పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0121-3 హిందోళవసంతం సంపుటం: 07-123

పల్లవి:
చెప్పవట్టి నీ సుద్దులు చెంగట నేనుండఁగానె
కొప్పువట్టి తీయవా ఆకొమ్మను నీవిపుడు

చ.1:
చేరి తూఁగు మంచమూఁచే చెలియ చనుమొనలు
తారుచు బొట్టనవేలఁ దాఁకించవా
కోరి సిగ్గువడి యాపె కుంచెవేయ వచ్చితేను
సారెకుఁ బోఁకముడి జారించవా యపుడు

చ.2:
వీడెమియ్య రాఁగాను వెలఁదిని సన్నచేసి
కూడఁగూడ మీఁజేతులు గోరనొత్తవా
తోడనే వొడ్డించుకుంటా దోసిటఁ బువ్వులియ్యగా
వేడుకనుంగరమాకెవేలం బెట్టవా

చ.3:
కంటసరి వెట్టఁగాను కామినిఁ గాఁగిట నించి
గెంటక యాకెమోవి యెంగిలిసేయవా
యింటిలోన నన్నుఁగూడి యిదివో శ్రీ వేంకటేశ
అంటి పాదాలొత్తఁగా నీవాకెమర్మాలంటవా