పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0120-6 నాదరామక్రియ సంపుటం: 07-120

పల్లవి:
రాఁగదవే యిఁకనేల రాపు బీరాలు
మాఁగిన మోవి తేనెకు మరిగిన దానవు

చ.1:
సిగ్గులువడ్డవారె పో చేతికి లోనౌదురు
యెగ్గులు వట్టేవారె పో యియ్యకొందురు
నిగ్గుల నెంచి చూచితే నీ కొలఁదివారా భువి
తగ్గక మరుతంత్రాల తగిలేటివారు

చ.2:
పట్టి పెనఁగే వారె పో పంతములెల్లా నిత్తురు
గుట్టు తోడనుండే వారే కూడుదురు
నెట్టన నెందరులేరు నీవలె పెచ్చురేఁగి
గట్టిగా మనసులు కరఁగేటివారలు

చ.3:
అనుమానించేవారె పో ఆసలకు లోనౌదురు
తనిసినవారె పో తమకింతురు
చెనకి యలమేలుమంగ శ్రీ వేంకటేశుఁడ నేను
మనవలెఁ గూడేవారే మచ్చికైనవారలు