పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0120-5 రామక్రియ సంపుటం: 07-119

పల్లవి:
రసికుఁడ తిరుపతి రఘువీరా
కొసరుగాదు నాలోని కూరిములు గాని

చ.1:
వెలయ నీవిఱిచిన విల్లువంటిది గాదు
విలసిల్లు నాబొమ్మలవిండ్లు గాని
చెలఁగి తపసుచేసీ చిత్రకూటగిరి గాదు
గిలుకొట్టు నాకుచగిరులు గాని

చ.2:
మేటియై నీవు వేసిన మెకముచూపు గాదు
సూటిదప్పని నా కనుచూపులు గాని
గాఁటమై నీవు సేతువు గట్టిన జలధి గాదు
చాటువ నాచెమటల జలధులు గాని

చ.3:
తగ నీవు గెలిచిన దనుజయుద్ధము గాదు
దగతోడి నా మదన యుద్దము గాని
నగు శ్రీ వేంకటేశ కనక సతి పొందు గాదు
పాగడే సీతనైన నాపాందులు గాని