పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0120-2 నాట సంపుటం: 07-116

పల్లవి:

వాఁడివో కంటిరటరే వన్నెలవాఁడు
పైడి మోలముకటారుపరుజులవాఁడు

చ. 1:

పెద్ద కిరీటము వాఁడు పీతాంబరమువాఁడు
వొద్దికఁ గౌస్తుభ మణివురము వాఁడు
ముద్దుల మొగమువాఁడు ముత్తేల నామమువాఁడు
అద్దిగో శంఖచక్రాల హస్తాలవాఁడు

చ. 2:

అందిన కటిహస్తము నభయహస్తమువాఁడు
అందెల గజ్జలఁ బాదాల మరువాఁడు
కుందణంపు యీ మకరకుండలంబులవాఁడు
కందువ బాహుపురుల కడియాలవాఁడు

చ. 3:

నగవుఁజూపులవాఁడు నాభికమలమువాఁడు
మొగపుల మొలనూళ్ళ మొలవాండు
చిగురుమోము వాఁడు శ్రీ వేంకటేశుఁడు
తగు నలమేలుమంగ తాళిమెడవాఁడు