పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0119-6 మంగళకౌాశిక సంపుటం: 07-114

పల్లవి:
ఎందాఁకఁ దెరలోన నేమి సేసేవు
చందమాయఁ బనులెల్ల చనవియ్యఁగదవే

చ.1:
చిలుకలకొలికి సిగ్గులు వడనేఁటికి
పలుకఁగదవే నీపతితోను
పిలిచి యాతఁడు నీకుఁ బ్రియములు చెప్పీని
అలుకలు దేరినిఁక నండకు రాఁగదవే

చ.2:
వనముకోగిలా వట్టిజాగులేఁటికే
కనుఁగొనవే నీకాంతునిని
చనవిచ్చి యాతఁడు సరసములాడీని
మనసులు గలిసెను మంతనమాడఁగదే

చ.3:
కొలని రాయంచా కొంక నీకేఁటికే
కలయఁగదే శ్రీనేంకటేశ్వరుని
లలినేలి నిన్నాతఁడు లాలించి కాఁగిలించి
వలపుల మితిమీరె వడదేర్చఁ గదవే