పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0119-5 భైరవి సంపుటం: 07-113

పల్లవి:
ఎంత వేగిరపడే వింతటిలోనే
చెంతనుండి యిప్పుడేల చెనకేవు నీవు

చ.1:
మనసు లోపలి మాట మంతనానఁ జెప్పీఁగాక
యెనసి యిందరిలోననేలడిగేవు
పనులేమి గలిగినా పానుపుపైఁ జెప్పీఁ గాక
వొనర యాల వొరసేవు నీవు

చ.2:
వేడుకైన ముచ్చటలు వెనకఁ జెప్పీఁ గాక
ఆడుమని మఱియేల ఆనవెట్టేవ్లు
వీడెమిచ్చినప్పుడే వినయాలు చెప్పీఁ గాక
జాడెఱఁగకిప్పుడేల జరసేవు నీవు

చ.3:
కందువైన ముచ్చటలు కౌఁగిటిలోఁ జెప్పీఁ గాక
గందమియ్యఁగానే యేల గరిసించేవు
ఇందునే శ్రీ వెంకటేశ యేలితివి చెలినిట్టే
పొందులట్టే యిప్పుడేల బోధించేవు నీవు