పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0119-4 శ్రీరాగం సంపుటం; 07-112

పల్లవి:
ఆకెఱుఁగు నీవూ నెఱుఁగుదదియె మాట
చేకానిక నీకిమ్మనె చెలియ నన్నిపుడు

చ.1:
వెన్నెల బాయిటనుండి వెలఁదిపాట వింటాను
చన్నులపైనొత్తితివి చంద్రవంకలు
అన్నిటా నీపై వలపులవె తలఁపించునని
విన్నపము సేయుమనె వింతగా నన్నిపుడు

చ.2:
చవికెలోపలనుండి చదురంగమాడుతాను
వువిదకిచ్చితివి నీవుంగరము
జవళినదే నిన్ను సారెఁ దలఁపించునని
తవిలి నీకెచ్చరించఁ దరవిచ్చెనిపుడు

చ.3:
పానుపు మీఁదట నుండి పడఁతికౌఁగిటఁ గూడి
పూని మోవిమీఁదఁ గెంపులు నించితి
నాని శ్రీ వేంకటేశుఁడ ననుపవే రేఁచునని
మోనాన మఱవకుండా మొక్కుమనెనిపుడు