పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0119-2 శుద్దవసంతం సంపుటం: 07-110

పల్లవి:
ఇప్పుడుగాక మఱి యిఁకనెన్నఁడు
గుప్పేటి కానుకలందుకొనవయ్య

చ.1:
పాలితి నీవద్దనుండి బుద్దులెల్లాఁ జెప్పఁగాను
చెలఁగి పారుపత్యాలు సేయవయ్యా
పలుమారునాకె రాయబారాలకు నడవఁగ
కొలువులు సేయించుకొనవయ్యా

చ.2:
అంగనలిందరని నీకతివ లెక్క చెప్పఁగ
చెంగటఁ గళ దింపుచుఁ జెన్నొందవయ్యా
సంగతిగా నాపె యవసరములు చెప్పఁగాను
అంగీకరించి యట్టి ఆదరించవయ్యా

చ.3:
అక్కజమై సతి నీకు నడపము పట్టఁగాను
పెక్కు వీడేలింతులకుఁ బెట్టవయ్యా
యిక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
మక్కువ తోడుతనిట్టే మన్నించవయ్యా