పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0119-1 వరాళి సంపుటం: 07-109

పల్లవి:
సరికి బేసికి మీచదురుఁదనాలు మించె
ఇరుగుపారుగులను యిద్దరును జాణలే

చ.1:
కలువల వేసితేను కమలాన వేసెనాపె
మలసి యెడమాటలు మఱియేఁటికి
పలువరుస చూపితే తలయెత్తి నిక్కెనాపె
యెలమిఁ దెలుసుకొంటిరిద్దరూను జాణలే

చ.2:
పరగ చేత మొక్కితే పాపట దువ్వెనాపె
అరసి లేకలు వా సి అంపనేఁటికి
పారిఁ గస్తూరి చల్లితే పొంచి కుంకుమాపె చల్లె
యిరవు దెలుసుకొంటిరిద్దరూను జాణలే

చ.3:
పచ్చడము గప్పుకుంటే పయ్యెద దెఱచెనాపె
ఇచ్చట సన్నలుసేయనిఁకనేఁటికి
మెచ్చితే శ్రీ వేంకటేశ మెయిలచ్చన చూపెనాపె
యెచ్చి లోలోనే కూడితిరిద్దరూను జాణలే