పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0102-4 ముఖారి సంపుటం: 07-010

పల్లవి:
నిండనానలు వెట్టుకు నీ వంతాను
అండనితశత్రుఁడ నీయాఱడిఁ జిక్కితిరా

చ.1:
కప్పురపు థూళిదెచ్చి కన్నులనిండాఁ జల్లి
అప్పుడే యాపెఁ గూడితివౌరా నీవు
తప్పులే కూడైనట్టి తాటోటుకాఁడవు నీతో
యిప్పుడు నమ్మి నీ పొందులెట్టు నేఁజేసితిరా

చ.2:
చేరెఁడు తట్టుపుణుఁగు చెవులనిండాఁ బోసి
యీరీతి మాటలాడితి వింతితోడను
తీరువడ్డ పెనులోకదిమ్మరివి నీకు నేను
ఆరితేరి నేఁడు నీకు నాలనెట్లెతిరా

చ.3:
కౌఁగిట నన్నుబిగించి కళ వట్టించి యాపెతో
చేఁగదేర నవ్వితివి శ్రీ వేంకటేశ
దాఁగిలి ముచ్చిములాడే దాయగాఁడవైన నిన్ను
తోఁగి చూచెట్టు నీరతిదొమ్మికి లోనైతిరా