పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0118-3 కేదారగౌళ సంపుటం: 07-105

పల్లవి:
ఎన్నఁడూ నలుగకుమీ యెదురుమాటాడకుమీ
పన్ని యీతని మనసు పట్టదే చెలియా

చ.1:
మంచితనములకే మగలు లోనౌదురు
వంచనచేఁతలకే వలతురు
చంచులఁ బాడినందుకే సతమై కరఁగుదురు
అంచల నింతులకివి అందములే చెలియా

చ.2:
ఇచ్చకపు మాటలకే యెన్నఁడును బాయరు
పచ్చిమోవితేనెలకే పైకొందురు
యిచ్చినచనవులకే యీడుజోడై చిక్కుదురు
నిచ్చలుఁ గామినులకు నేరుపులే చెలియా

చ.3:
తగులాయమైనందుకే తమకింతురెప్పుడును
నగవులతేటలకే ననుపౌదురు
నిగిడి శ్రీ వేంకటాద్రి నిలయునిఁ గూడితివి
తగిన సతులకివే తగవులే చెలియా