పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0117-5 మధ్యమావతి సంపుటం: 07-101

పల్లవి:
వేగునంతానేల జాలి వెలుమజోలి
సోగకన్నుల నాతనిఁ జూడఁగరాదా

చ.1:
చలమే నీకు బలమా సరసములాడరాదా
వలచిన రమణుఁడు వద్లనుండఁగా
అలిగితేనేమాయ నప్పటీకపుడె పోయ
చెలులు చెప్పఁగా సందుచేకొనరాదా

చ.2:
పట్టినదే పంతమా పైకొని మాటాడరాదా
గుట్టుతో నీపతి చెంత గూచుండఁగా
వొట్టుక దోసములేదు వొగి నీకుఁ బొద్దువోదు
పెట్ట గిలిగింతలకే బెట్టి నవ్వరాదా

చ.3:
సిగ్గులే మూలధనమా చేరి పైకొనఁగ రాదా
అగ్గమై శ్రీ వేంకటేశుఁడలమఁగాను
యెగ్గులెల్లా నేఁడె జారె యెదుటఁ బ్రియములూరె
వెగ్గళించె నాస వెల్లవిరులు గారాదా