పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0117-4 రామక్రియ సంపుటం: 07-100

పల్లవి:
ఆడినట్లే ఆడీ వీఁడు అద్దములో నీడవలె
జాడతొడ కన్నులనే సన్న సేసీనే

చ.1:
కోరి జలకము కేళాకూళిలో నేనాడఁగాను
ఆరసి తానీఁద వచ్చీనాడకే తాను
తారసిలి సిగ్గుతో నేఁ దామరమొగ్గలంటితే
సారపుఁగమలాలంటాఁ జన్నులంటీనే

చ.2:
చెంది పొదరింటి లోన చీర నేఁగట్టుకోఁగాను
అందిమ్మనీఁ బచ్చడము ఆడనే తాను
కందువ సిగ్గుతో నేను కమ్మఁజిగురు వట్టితే
ముందే నాచిగురుమోవి మోవిఁ బట్టినే

చ.3:
అలసి నేనొకచోటనారగించఁ గూచుండితే
వలెనంటా నాపొత్తుకు వచ్చీనే తాను
అలరి సిగ్గుతోడ నేనట్టె చేయెత్తి మొక్కితే
యెలమి శ్రి వేంకటేశుఁడిటుగూడి మొక్కెనే